భారత వైమానిక దళం (IAF) 2026 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్న "అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ"ని పల్నాడు జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో కోరారు.
ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు జిల్లాలో జరగనుంది. మహిళా అభ్యర్థులు మార్చి 09, 2026న, పురుష అభ్యర్థులు మార్చి 12, 2026న హాజరుకావాలి. రిపోర్టింగ్ సమయం ఉదయం 6:00 గంటల నుండి 10:00 గంటల వరకు ఉంటుంది.
అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 02 జూలై 2005 నుండి 02 జనవరి 2009 మధ్య జన్మించి ఉండాలి. అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన కోర్సులో కనీసం 50% మార్కులతో పాటు, ఇంగ్లీష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50% మార్కులు సాధించి ఉండాలి. ఎత్తు కనీసం 152 సెం.మీ. ఉండాలి.
ఈ ర్యాలీకి ఎటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, అర్హులైన అభ్యర్థులు నేరుగా ర్యాలీ వేదిక వద్దకు హాజరుకావచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ వెంట ఒరిజినల్ విద్యార్హత పత్రాలు, డొమిసిల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, 10 పాస్పోర్ట్ సైజు ఫోటోలు మరియు సర్టిఫికేట్ల యొక్క 6 సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలి.
దేశ సేవ చేయాలనే ఆకాంక్షతో ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. మరిన్ని వివరాల కోసం https://agnipathvayu.cdac.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.

