విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఒక ఆకతాయి మహిళల స్నాన ఘట్టాలను చిత్రీకరించడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. మహామండపంలోని 6వ అంతస్తులో ఉన్న మహిళల స్నానాల గదిలోకి చొరబడిన యువకుడిని మహిళా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఆలయ మహామండపంలోని 6వ అంతస్తులో ఉన్న మహిళల స్నానాల గదిలోకి చొరబడిన నరేష్ (20) అనే యువకుడు, మహిళలు స్నానం చేస్తున్న దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు. అనుమానాస్పదంగా గమనించిన మహిళలు వెంటనే అప్రమత్తమై కేకలు వేశారు.
మహిళల అరుపులు విన్న వెంటనే అక్కడికి చేరుకున్న మహిళా సెక్యూరిటీ సిబ్బంది, సదరు యువకుడిని అడ్డుకుని, పట్టుకుని చితకబాదారు. అనంతరం, స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతానికి చెందినవాడని గుర్తించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఇలాంటి సంఘటన జరగడం భక్తులలో ఆందోళన రేకెత్తించింది. మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.







