అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్రపై ఇజ్రాయెల్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌ను విశ్వసనీయమైన మధ్యవర్తిగా పరిగణించబోమని భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ స్పష్టం చేశారు.
రూవెన్ అజార్ మాట్లాడుతూ, అమెరికా తన సొంత ప్రయోజనాల కోసం పాకిస్థాన్‌ను ఉపయోగించుకుంటుండవచ్చునని, అయితే ఇజ్రాయెల్ మాత్రం పాకిస్థాన్‌ను నమ్మడం లేదని తెలిపారు. గతంలో ట్రంప్ పరిపాలనలో గాజాలో కాల్పుల విరమణ కోసం ఖతార్, టర్కీ వంటి దేశాలతో పనిచేసిన అనుభవం, ప్రస్తుత పాకిస్థాన్ విషయంలోనూ పునరావృతమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న పోరాటంపై అజార్ స్పష్టతనిచ్చారు. దక్షిణ లెబనాన్‌ను హిజ్బుల్లా ఉగ్రవాద మౌలిక సదుపాయాల నుంచి పూర్తిగా తొలగించడమే తమ లక్ష్యమని, ఇది లెబనాన్ ప్రభుత్వ బాధ్యత అని ఆయన నొక్కి చెప్పారు. గత కొన్ని గంటల్లో ఇజ్రాయెల్ వైమానిక దళం లెబనాన్‌లో 250 మందికి పైగా హిజ్బుల్లా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ నిర్వహించిందని ఆయన వెల్లడించారు.
ఇరాన్‌తో అమెరికా చేస్తున్న చర్చలకు ఇజ్రాయెల్ మద్దతు ఇస్తుందని అజార్ తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి ఉత్పత్తి వంటి కీలక ముప్పులను ఈ చర్చలు పరిష్కరిస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఒప్పందాన్ని దెబ్బతీస్తాయని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ ప్రమేయం లేదని అమెరికా, ఇజ్రాయెల్ గతంలోనే స్పష్టం చేశాయి.











