జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల శివారులో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది.
వివరాల్లోకి వెళితే, రోడ్డు పక్కన టైరు ఫంక్షర్ అవ్వడంతో నిలిపి ఉంచిన లారీని, కోరుట్ల నుండి జగిత్యాల వైపు వస్తున్న ద్విచక్రవాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ ప్రమాదంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతా చర్యలను కఠినతరం చేయాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.










