ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంటలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. టీబీ లక్షణాలు, నివారణ చర్యలపై వైద్యులు వివరించారు.
ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జమ్మికుంట ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థులతో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వరుణ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. 'టీబీ అంతం - మన అందరి పంతం' వంటి నినాదాలతో ర్యాలీ సాగింది.
ర్యాలీ అనంతరం పాఠశాల విద్యార్థులకు డాక్టర్ వరుణ, హెల్త్ ఎడ్యుకేటర్ అడిదెల మోహన్ రెడ్డి టీబీ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యతను, వడదెబ్బ లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వైద్యులు వివరించారు. అనంతరం విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి, టీబీ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. టీబీకి పరీక్షలు, మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.










