నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే ప్రియుడు తనకు ఇష్టం లేదని చెప్పడంతో మనస్తాపానికి గురైన ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వైఎస్సార్ కడప జిల్లా చిన్నచౌకు ఠాణా పరిధిలో ఈ దారుణం జరిగింది. కడప పటేల్‌రోడ్డుకు చెందిన రెహానా (26) ఎమ్మెస్సీ పూర్తిచేసి, ఇటీవల పట్టా అందుకుంది. ఈమెకు బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్తో ఫిబ్రవరి 15న నిశ్చితార్థమైంది.
నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ, చాటింగ్ చేసుకునేవారు. అయితే, ఇటీవల షాజహాన్ రెహానాతో మాట్లాడుతూ, 'నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను చూస్తుంటే ఎటువంటి ఫీలింగ్స్ రావడం లేదు, నాకు ఇదివరకే నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు' అని చెప్పాడు. తొలుత అతను సరదాగా అంటున్నాడని రెహానా భావించింది.
అతడు పదేపదే అదే మాట అనడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన రెహానా, సోమవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలంలో పోలీసులు 12 పేజీల సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు.
రెహానా తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.










