జేఈఈ మెయిన్స్–2026 పరీక్షా ఫలితాల్లో నిజామాబాద్‌లోని కాకతీయ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు పలు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. పాఠశాల స్థాయి నుంచే అందించిన నాణ్యమైన విద్య, సమగ్ర బోధనా విధానం ఈ విజయం సాధించడానికి దోహదపడిందని విద్యార్థులు, యాజమాన్యం తెలిపారు.
కాకతీయ విద్యాసంస్థలో అమలు చేస్తున్న ప్రత్యేక విద్యా విధానం, ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ కోర్సులను ప్రాథమిక స్థాయి నుంచే బోధించడం విద్యార్థులకు మేలు చేసిందని, తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకులు సాధించగలిగారని తెలిపారు. విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ, అధ్యాపకుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం తమ విజయానికి కీలకమని పేర్కొన్నారు.
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్. హేమ 132వ ర్యాంక్, రాణి 1,782వ ర్యాంక్, రమాదేవి 2,800వ ర్యాంక్, ఓమధ్య 2,984వ ర్యాంక్, ఆర్థిక 4,761వ ర్యాంక్, భరత్ 6,430వ ర్యాంక్, శరత్ చంద్ర 8,388వ ర్యాంక్, అమృత వర్షిణి 9,461వ ర్యాంక్, మక్ష 9,463వ ర్యాంక్, ప్రజ్వల్ 10,292వ ర్యాంక్‌లతో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
మొత్తం 90 శాతం పైగా ఫలితాలు సాధించిన ఈ సంస్థ నుంచి 50 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధించడం గమనార్హం. అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణ, తరచుగా నిర్వహించే పరీక్షలు, వాటి విశ్లేషణలు తమ ర్యాంకులను మెరుగుపరచుకోవడానికి సహాయపడ్డాయని విద్యార్థులు తెలిపారు. భవిష్యత్తులో సీఎస్ఈ చదివి సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కావాలనే లక్ష్యంతో ఉన్నట్లు కొందరు పేర్కొన్నారు.
సంస్థ డైరెక్టర్లు సీహెచ్ రామోజీరావు, సీహెచ్ తేజస్విని మాట్లాడుతూ, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికాబద్ధమైన బోధన, నిరంతర పరీక్షల నిర్వహణ ద్వారా విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కృషి, క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వంతో లక్ష్యసాధన సాధ్యమని, ఈ విజయాలు భవిష్యత్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు.












