వేసవిలో మార్కెట్లలో లభించే మామిడి పండ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. నిగనిగలాడుతూ ఆకర్షణీయంగా కనిపించే కొన్ని మామిడి పండ్ల మాటున ప్రాణాంతకమైన రసాయనాలు దాగి ఉన్నాయని ఆయన తెలిపారు. డబ్బుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సహజంగా పక్వానికి రావాల్సిన మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గిస్తున్నారని సజ్జనార్ వెల్లడించారు. రోడ్డు పక్కన కనిపించే ఇలాంటి పండ్లను కొనుగోలు చేయడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమేనని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
సహజంగా పండిన పండ్లు అంతటా ఒకే రంగులో ఉండవని, అయితే రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపుపచ్చగా ఉండి, లోపల పచ్చిగా ఉండటంతో పాటు విషతుల్యంగా మారతాయని సీపీ సజ్జనార్ వివరించారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతులో మంట, వాంతులు, విరేచనాలు, కడుపులో వికారం వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారులపై హైదరాబాద్ పోలీస్ విభాగం ఉక్కుపాదం మోపుతోందని సజ్జనార్ స్పష్టం చేశారు. కల్తీ మామిడి పండ్లపై హెచ్-ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్) పటిష్టమైన నిఘా ఉంచుతోందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబర్ 87126 61212 కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆసీఫ్నగర్లోని ఓ గోదాంలో సుమారు 7 టన్నుల కల్తీ మామిడి పండ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.











