ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కోర్టు తీర్పుతో తాను నిర్దోషిగా బయటపడ్డానని, ఇది నిజం వెలుగులోకి వచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. కేసు పూర్తిగా అవాస్తవాలపై ఆధారపడిందని ఆమె పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. 'కడిగిన ముత్యంలా బయటకు వస్తాను' అన్న తన మాట కోర్టు తీర్పుతో నిజమైందని ఆమె అన్నారు.
కోర్టు వాదనలను అసత్యాలని స్పష్టం చేసి, కేసులో ఉన్న వారందరికీ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు కవిత తెలిపారు. అయితే, ఈ క్రమంలో ఐదున్నర నెలలు కుటుంబానికి, పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, అవమానాలు, వ్యక్తిత్వ హననం ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కష్ట సమయంలో అండగా నిలిచిన కార్యకర్తలు, తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త కుటుంబానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు తీర్పు తర్వాత బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ, పార్టీ ఓటమికి తనను బాధ్యురాలిని చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు అంగీకరించరని, ఉద్యోగాలు, ఇళ్లు, అహంకారం వంటి అంశాలే ఓటమికి కారణమని పేర్కొన్నారు.
తాను రెండు నెలల్లో కొత్త పార్టీని స్థాపించనున్నానని, ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతానని కవిత స్పష్టం చేశారు.


