జిల్లాలో వివిధ రంగాలకు రుణాల పంపిణీ, ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.
గురువారం ఐడీఓసీ కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక అమలును సమీక్షించారు. అలాగే, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.
వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, విద్య, గృహ నిర్మాణం వంటి కీలక రంగాలకు రుణాల మంజూరులో బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.
ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై), ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ), పీఎంఎఫ్ఎంఈ, పీఎం విశ్వకర్మ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు.
స్వయం సహాయక సంఘాల బ్యాంకు అనుసంధానం, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా అందజేస్తున్న రుణాల పురోగతిని కూడా సమీక్షించారు. ప్రతి అర్హ కుటుంబానికి ఆర్థిక సేవలు చేరేలా బ్యాంకులు ప్రజలకు మరింత చేరువ కావాలని కలెక్టర్ పేర్కొన్నారు.












