కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకురాలు ఇందుప్రియ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
తనపై, కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఇందుప్రియ ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీకి అనుచరులైన పర్వేజ్ అహ్మద్, షేర్ ముక్తార్, ఇర్ఫాన్, కేఫ్, మహమ్మద్ ఇసాక్ షేర్, మహమ్మద్ ఇలియాజ్, అస్రర్ వంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలోనూ తనపై ఇలాంటి అసత్య ప్రచారం చేసిన మహమ్మద్ ఇసాక్ షేరుపై 2005లో కేసు నమోదైందని, ఇప్పుడు మళ్లీ అదే తరహాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఇందుప్రియ తెలిపారు. పర్వేజ్ అహ్మద్ గతంలో జరిగిన కామారెడ్డి కత్తిపోట్ల సంఘటనలో ప్రధాన నిందితుడని, తిరిగి వచ్చి మహిళలు, హిందువులపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
ఈ దుష్ప్రచారం వెనుక మహమ్మద్ ఇసాక్ షేర్, మహమ్మద్ ఇలియాజ్ లు ఉన్నారని, వారి నాయకత్వ బలంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శాంతియుతంగా ఉన్న కామారెడ్డిలో ఒక మహిళ గురించి అసభ్య పదజాలం వాడటం వల్ల ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ అంశంపై TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఇందుప్రియ తెలిపారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










