కామారెడ్డి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా కురిసిన వడగండ్ల వర్షం రైతులల్లో ఆందోళన రేకెత్తించింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నదాతలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి పట్టణంతో పాటు శివారు గ్రామాల్లో అకస్మాత్తుగా వాతావరణం మారి, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. ఈ వర్షం కొద్దిసేపే కురిసినప్పటికీ, రైతులపై దాని ప్రభావం ఎక్కువగా ఉంది.
గత కొద్ది రోజులుగా తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో వాతావరణం చల్లబడింది. అయితే, రైతుల పరిస్థితి అందుకు భిన్నంగా మారింది.
ప్రస్తుతం వరి పంటలు కోత దశలో ఉండటంతో, వడగండ్ల వాన కారణంగా ధాన్యం నేలరాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని వారు తెలిపారు.
అధికారులు వెంటనే స్పందించి, పంట నష్టంపై సమగ్ర అంచనా వేసి, రైతులకు అవసరమైన సహాయాన్ని అందించాలని కోరుతున్నారు.












