కామారెడ్డి జిల్లాలో గృహ వినియోగ LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్న 30 సంస్థలను పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో 31 సిలిండర్లను స్వాధీనం చేసుకుని, సంబంధిత సంస్థలపై అత్యవసర వస్తువుల చట్టం కింద కేసులు నమోదు చేశారు.
కామారెడ్డి జిల్లాలోని రాజంపేట, కామారెడ్డి, బానువాడ, గాంధారి, జుక్కల్ మండలాల్లో ఆదివారం పౌర సరఫరాల శాఖ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటళ్లు, మెస్‌లు, ఇతర వాణిజ్య సంస్థలు గృహ వినియోగ LPG సిలిండర్లను అక్రమంగా వాడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తం 30 సంస్థలు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి, 31 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
సంబంధిత సంస్థలపై అత్యవసర వస్తువుల చట్టం–1955 కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడాన్ని అరికట్టేందుకు తరచూ తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
జిల్లాలో LPG సరఫరా పరిస్థితి సాధారణంగానే ఉందని, కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 4117 బుకింగ్స్ నమోదుకాగా, 3038 రీఫిల్స్ పంపిణీ చేశారు. వివిధ LPG ఏజెన్సీల వద్ద 5744 రీఫిల్ సిలిండర్లు నిల్వలో ఉన్నాయని, సరఫరా సజావుగా అందుతోందని వివరించారు.
వినియోగదారులు అవసరం లేని బుకింగ్స్, సిలిండర్ల నిల్వలకు దూరంగా ఉండాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి పాటించాలని, ప్రతి కుటుంబానికి సమానంగా LPG అందేలా నిబంధనలు పాటించాలని కోరారు.









