ప్రపంచంలోనే తొలి స్పోర్ట్స్ హ్యాకథాన్‌లో కామారెడ్డి జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విజేతలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అభినందించారు.
క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాకారులు రాణించడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల పాటు నిరంతరంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, క్రీడాకారులు, స్టార్టప్‌లు, యువ ఆవిష్కర్తలు పాల్గొన్నారు.
ఈ హ్యాకథాన్‌లో మొత్తం 2,132 ఆవిష్కరణలు రూపొందినట్లు తెలిపారు. యువతలో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని కలెక్టర్ అన్నారు. క్రీడల్లో పనితీరు మెరుగుదల, శిక్షణ విధానాలు, ఫ్యాన్ ఎంగేజ్మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఈ ఆవిష్కరణలు కొత్త దారులు చూపిస్తాయని ఆయన తెలిపారు.
ఈ హ్యాకథాన్‌లో షటిల్ బ్యాడ్మింటన్ అండర్-17 గర్ల్స్ డబుల్స్‌లో అవని రెడ్డి, ఆరాధ్య రెడ్డి గోల్డ్ మెడల్ సాధించారు. 2 కిమీ పరుగుపందెం మరియు కరాటే అండర్-14 విభాగంలో ధనుష్ కుమార్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. అండర్-9 బాయ్స్ సింగిల్స్‌లో శ్రీ వెంకట్ సిల్వర్ మెడల్ సాధించగా, అండర్-13 బాయ్స్ డబుల్స్‌లో జై ప్రీత్, జిశాన్ కాంస్య పతకం పొందారు. అండర్-15 బాయ్స్ డబుల్స్‌లో విష్ణు, నియాన్ కాంస్య పతకం గెలుచుకోగా, అండర్-15 గర్ల్స్ సింగిల్స్‌లో చేతన కాంస్య పతకం సాధించింది. అండర్-15 గర్ల్స్ డబుల్స్‌లో అక్షర, చేతన జంట కాంస్య పతకం గెలుచుకున్నారు.
జిల్లాలో ప్రతిభావంతమైన క్రీడాకారులను గుర్తించి స్పోర్ట్స్ హ్యాకథాన్‌లో పాల్గొనేలా చేసిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) ఉత్తర తెలంగాణ జోన్ సెక్రటరీ చెల్లాపురం శ్రీకాంత్‌ను కూడా జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్, కోచ్ సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












