సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో ప్రదర్శితమైన "సూర్య చంద్రుల" నాటక కళాకారులను సంస్కార భారతి, కామారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ మూడు రోజుల నాటక ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
లింగంపల్లి గ్రామంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో ప్రదర్శితమైన "సూర్య చంద్రుల" నాటకం, ముఖ్యంగా 24వ తేదీన జరిగిన ప్రదర్శనకు గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరై తమ కళాభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సంస్కార భారతి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డా. జి. సమ్మిరెడ్డి సూచనల మేరకు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పాతూరి సత్యప్రసాద్, జిల్లా సంయుక్త ప్రధాన కార్యదర్శి డా. ఎన్. రాజు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కళాకారులకు ఘన సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ పాతూరి సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఆధునిక యుగంలో అంతరించిపోతున్న జానపద కళారూపాలను కాపాడుతూ సమాజానికి అందిస్తున్న కళాకారుల సేవలను ప్రశంసించారు. అలాంటి కళలను ఆదరిస్తూ, ఆస్వాదిస్తూ వాటి పరిరక్షణకు తోడ్పడుతున్న గ్రామ ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు. సంస్కార భారతి లక్ష్యాలను, భారతీయ సంస్కృతి పరిరక్షణలో సంస్థ చేస్తున్న సేవలను ప్రజలకు వివరించారు.
ఈ నాటక ప్రదర్శనను తిలకించడానికి సుమారు 1500 నుంచి 2000 మంది వరకు అన్ని వయసుల వారు హాజరుకావడం విశేషం. నేటి డిజిటల్ యుగంలో పిల్లలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4:30 గంటల వరకు నాటకం కొనసాగినా, ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించడం గ్రామస్తుల కళాభిమానాన్ని తెలియజేసింది. కుటుంబ సమేతంగా నాటకాన్ని ఆస్వాదించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సంస్కార భారతి తరఫున కళాకారులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేశారు. సంస్కార భారతి సేవలందించే కరపత్రాలను కళాకారులు, గ్రామ పెద్దలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక విభాగ్ సహా సంయోజక్, అధ్యక్షులు బాలరాజు గౌడ్, అమృత రాజేందర్, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, గ్రామ అధ్యక్షులు రెడ్డి రాజయ్య, అమృత సంతోష్, గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు టేక్రియాల రమేష్, పంతులు మిద్దెల గంగారెడ్డి, కళాబృందం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












