కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన కవల కుమార్తెలనే బావిలో తోసి హత్య చేసిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.
కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి పరిధిలో ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కచ్చు శ్రీశైలం అనే వ్యక్తి తన నలుగురు కుమార్తెలైన గీతాన్ శ్రీ, గీతాన్వికలను వ్యవసాయ బావిలో తోసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, శ్రీశైలం తన కుమార్తెలు పుట్టారని తరచూ భార్యతో గొడవపడేవాడని తెలిసింది. మూడు నెలల క్రితం విడాకుల పంచాయితీ కూడా జరిగినట్లు సమాచారం. తాజాగా, పిల్లలను బావి వద్దకు తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్నాయి.
గ్రామస్థులు శ్రీశైలంను అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. సుమారు 5 గంటలపాటు జరిగిన గాలింపు చర్యల అనంతరం ఇద్దరు పిల్లల మృతదేహాలను బావి నుంచి వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.










