కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో భార్య బంగారం, డబ్బుతో ప్రియుడితో పరారైందనే మనస్తాపంతో ఇద్దరు పిల్లలను చంపి, ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఈ విషాదం జరిగింది.
కుణిగల్ తాలూకా ఆల్కెరె గ్రామానికి చెందిన శివణ్ణ, మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తూ, ప్రైవేట్ కంపెనీలో కూడా ఉద్యోగం చేస్తున్నాడు. భార్య కావ్య, ఇద్దరు పిల్లలతో అతని జీవితం సంతోషంగా సాగుతుండగా, వారం రోజుల క్రితం కావ్య మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.
భార్య కనిపించక పోవడంతో శివణ్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొంతకాలం తర్వాత కావ్య ఇంటికి తిరిగి వచ్చింది. అయితే, మరుసటి రోజే ఇంట్లోని బంగారం, నగదుతో ఆమె మళ్ళీ పరారైంది. ఈ ఘటనతో శివణ్ణ తీవ్రంగా కుంగిపోయాడు.
ఈ పరిస్థితులతో విరక్తి చెందిన శివణ్ణ, శుక్రవారం రాత్రి తన ఇద్దరు మగ పిల్లలను గొంతు నులిమి చంపాడు. అనంతరం, ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు ఈ ఘాతుకానికి దారితీసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.











