రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఫీజుల నియంత్రణకు ఈ నెలలోనే చట్టం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.
హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ముఖ్యమంత్రే ప్రైవేట్ విద్యాసంస్థల ప్రారంభోత్సవాలకు వెళ్తూ వారిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని, ఈ విషయంలో ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఫీజు పెంపు లేకుండా జీవో జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తెచ్చిన ఎంఎస్-7 జీవోతో ఫీజు రీయింబర్స్ మెంట్ ను నిలిపివేసే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న రూ.11,000 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్ పీఎస్) లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. హెచ్ పీఎస్ పనితీరుపై సమగ్ర సమీక్ష జరిపి, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.











