ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్లో వెలుగుమట్ల ప్రాంతానికి చెందిన నిరాశ్రయ కుటుంబాలు మరియు వారి చిన్నారుల కోసం ఉచిత వైద్య శిబిరం, ఆరోగ్య అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా ప్రజలు వైద్య సేవలు పొందారు.
డా. గొంగూర వెంకటేశ్వర్లు (జి.వి.) ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరంలో, ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు, ప్రాథమిక రక్తపరీక్షలు మరియు ఇతర వైద్య సేవలు అందించారు. ప్రత్యేకంగా పిల్లలు, మహిళలు, వృద్ధుల ఆరోగ్య సమస్యలపై వైద్యులు దృష్టి సారించారు.
ఈ సందర్భంగా డా. గోంగూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి ఆరోగ్య సేవలు అందించడం మన సామాజిక బాధ్యత. నివాసం కోల్పోయిన కుటుంబాలకు వైద్య సహాయంతో పాటు ఆరోగ్య అవగాహన కూడా అవసరం. ఇలాంటి శిబిరాలను నిరంతరం నిర్వహిస్తాము” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా. షేక్ యేడుకొండలు, డా. కృప, డా. హనుమంత్ రావు, నరేష్, కిరణ్, అరుణ్, శ్రీకాంత్, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొని తమ సేవలను అందించారు. వీరి సమష్టి కృషితో శిబిరం సజావుగా సాగింది.
శిబిరంలో పాల్గొన్న లబ్ధిదారులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం సమాజంలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంచడంలో సహాయపడింది.

