కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పురాతన కోడూరి ఆంజనేయస్వామి క్షేత్రంలో వేయి మంది భక్తులు ఏకస్వరంతో 101 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా కురిసిన కుంభ వర్షం భక్తికి దైవ సమాధానంగా భక్తులు భావించారు.
బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మగారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, భక్తుల ప్రార్థనలు ఆకాశాన్ని తాకాయి. 101 సార్లు మారుమ్రోగిన హనుమాన్ చాలీసా పారాయణం ధ్వని భక్తి తరంగాలను సృష్టించింది.
పారాయణం అనంతరం కురిసిన కుంభ వర్షాన్ని వేద పండితులు దైవానుగ్రహంగా అభివర్ణించారు. ఇది ప్రకృతి పలికిన మంగళ గీతమని, భక్తి శక్తికి దైవ సమాధానమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ప్రపంచ చరిత్రలో గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కే అవకాశం ఉందని పండితులు తెలిపారు. వెయ్యి మంది భక్తులు దాదాపు 6 గంటల పాటు ఏకాసనం మీద ఉండి పారాయణం చేయడం విశేషం.
భవిష్యత్తులో ప్రతి శనివారం, మంగళవారం, పూర్ణిమ రోజున స్వామి వారిని దర్శిస్తే సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు ఆకాంక్షించారు.











