ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు చేయూతనిస్తూ, కెఆర్కే సన్‌షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో శనివారం రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో షీ టీమ్ పి.సి. శ్రీమతి సౌజన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కెఆర్కే సన్‌షైన్ చారిటబుల్ ట్రస్ట్, వితంతువులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఆదాయం లేని పేదల వంటి అత్యంత వెనుకబడిన కుటుంబాలను గుర్తించి వారికి సహాయం అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ట్రస్ట్‌కు అందిన వెయ్యికి పైగా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, సర్వే ద్వారా అర్హులైన 250 కుటుంబాలను ఎంపిక చేశారు.
ఎంపికైన 250 కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులతో కూడిన రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన షీ టీమ్ పి.సి. శ్రీమతి సౌజన్య, ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.
కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ & మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాలకు అండగా నిలవడం తమ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.
ట్రస్ట్ డైరెక్టర్ ఖైరున్నిసా బేగం, ఇన్చార్జ్ నేహా నాజ్, ఫీల్డ్ ఆఫీసర్ తస్లీమ్, ట్రైనర్ రష్మీతతో పాటు పలువురు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పలు కుటుంబాలు స్వల్పకాలిక ఉపశమనం పొందాయి.


