మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ఎస్పీ శబరీష్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల పలువురు సి.ఐ.ల బదిలీలు ఈ ప్రక్షాళనకు నాంది పలికినట్లు తెలుస్తోంది.
జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి, ఎస్పీ శబరీష్ పోలీస్ శాఖలో పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించే దిశగా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇటీవల పలువురు సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేయడం ఈ క్రమంలోనే జరిగినట్లు సమాచారం.
పోలీస్ వర్గాల్లో జరుగుతున్న చర్చల ప్రకారం, ఈ బదిలీలు కేవలం ఆరంభం మాత్రమేనని, తదుపరి ఎస్.ఐ.లు, రైటర్లు, హెడ్ కానిస్టేబుళ్లపై కూడా వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. స్టేషన్లలో అక్రమాలకు పాల్పడుతూ, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారుల వివరాలు ఎస్పీ కార్యాలయానికి చేరినట్లు సమాచారం.
అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు కిందిస్థాయి అధికారుల్లో ఎస్పీ శబరీష్ పేరు వింటేనే భయం నెలకొందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. "పని చేసేవారికి నా అండ ఉంటుంది, తప్పు చేసేవారికి శిక్ష తప్పదు" అనే నినాదంతో ఎస్పీ క్షేత్రస్థాయిలో నిఘాను పెంచినట్లు సమాచారం. బాధితులకు న్యాయం చేయాలని, ప్రజల నమ్మకాన్ని కాపాడాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.
అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేయడంతో, అక్రమార్కులు భయాందోళనల్లో ఉన్నట్లు సమాచారం. ఎస్పీ శబరీష్ మార్క్ ప్రక్షాళన మహబూబాబాద్ పోలీస్ శాఖలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుందని, తప్పు చేసేవారికి మాత్రం ఇదొక సింహస్వప్నంగా మారుతుందని భావిస్తున్నారు.







