ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, వసతిగృహాల పరిశుభ్రత, సౌకర్యాలపై సమీక్షించారు.
ఏప్రిల్ 20 నుండి 26వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ సంక్షేమ వారోత్సవాలలో భాగంగా, జిల్లా కలెక్టర్ గూడూరులోని మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహాన్ని సందర్శించారు.
కలెక్టర్ విద్యార్థినులతో కలిసి భోజనం చేయడంతోపాటు, వసతిగృహంలోని పరిసరాలను, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. వారం రోజుల పాటు ప్రతిరోజూ పరిశుభ్రత, ఆరోగ్యం, మరమ్మతులు వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
వసతిగృహ సిబ్బందికి స్టోర్ గది, తరగతి గదులు, వంటగది, భోజనశాల, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. భోజనం సిద్ధం చేసే సిబ్బందికి వైద్య పరీక్షలు తప్పనిసరి అని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.
విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి నూతన టెక్నాలజీ, డిజిటల్ తరగతుల వినియోగంపై ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. క్రీడా, మానసిక వికాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని, సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు అవకాశాలు కల్పించాలని తెలిపారు.







