మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సతీమణి డాక్టర్ రాధా మను చౌదరి, మహిళా సాధికారతలో విద్య పాత్రను నొక్కి చెప్పారు.
జిల్లా కలెక్టర్ సతీమణి డాక్టర్ రాధా మను చౌదరి మాట్లాడుతూ, ఒక అమ్మాయి చదువుకుంటే అది మంచి సమాజ నిర్మాణానికి బలమైన పునాది అవుతుందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగమిస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె ప్రశంసించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళా వ్యవస్థాపకులు, మహిళా సంఘాల ప్రతినిధులను ఈ సందర్భంగా సన్మానించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా సిబ్బంది కోసం క్రీడా పోటీలు కూడా నిర్వహించారు. చెస్, క్యారమ్స్, లెమన్ అండ్ స్పూన్, స్పీడ్ వాకింగ్, రన్నింగ్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్ వంటి పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, మహిళలు మానసికంగా దృఢంగా ఉండి, పురుషుల కంటే మెరుగ్గా ఏదైనా సాధించగల సామర్థ్యం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఆడపిల్లల చదువుకు తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారిణి విజయకుమారి, ఎస్సీ అభివృద్ధి అధికారి వినోద్, డీఆర్డీఓ సాంబశివరావు, క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, సివిల్ సప్లై అధికారిణి సుగుణాబాయి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అజేయలక్ష్మి, ఏఈ స్నేహలత, టిఎన్జీఓ ప్రతినిధులు కురుమూర్తి, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

