మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 25.65 గ్రాముల MDMA, వాహనాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
మల్కాజిగిరి ఎస్ఓటీ, ఎల్బీనగర్ జోన్ మరియు నాగోల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో MDMA డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. నిందితుల నుంచి 25.65 గ్రాముల నిషేధిత డ్రగ్స్‌తో పాటు వాహనాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అరెస్ట్ అయిన వారిలో టోలిచౌకికి చెందిన జునైద్ రజా సిద్ధిఖీ (36), బండ్లగూడ సన్ సిటీకి చెందిన సునీల్ సుబ్బా అలియాస్ జానీ (29) ఉన్నారు. వీరిద్దరూ గతంలో సన్ సిటీలో ఒక రెస్టారెంట్‌ను నిర్వహించినట్లు సమాచారం. జునైద్ రజా ఐటీ స్టాఫింగ్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా, సునీల్ సుబ్బా బార్ టెండర్‌గా పనిచేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, నిందితులకు మహ్మద్ అన్సారీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అన్సారీకి అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉండగా, హిమాచల్ ప్రదేశ్ నుంచి MDMAను తెప్పించి, రాజు అనే వ్యక్తి ద్వారా వీరికి అందించేవాడు. అనంతరం వీరు నగరంలో డ్రగ్స్ విక్రయించేవారు.
నమ్మదగిన సమాచారం మేరకు ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం నాగోల్ ఎక్స్ రోడ్ వద్ద నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, రెండు హోండా యాక్టివా వాహనాలపై వచ్చిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా, వాహనాల్లోని బ్యాగుల్లో దాచిన 25.65 గ్రాముల MDMA బయటపడింది. ప్రధాన సూత్రధారులు మహ్మద్ అన్సారీ, రాజు పరారీలో ఉన్నారు.










