మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని మల్కాజ్గిరి కమిషనరేట్ మహిళా భద్రత విభాగం డీసీపీ టి. ఉషారాణి హెచ్చరించారు. షీ టీమ్స్ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా పలువురిపై కేసులు నమోదు చేసి, కౌన్సెలింగ్ నిర్వహించారు.
మహిళలు భయం లేకుండా జీవించే హక్కును కలిగి ఉన్నారని, వారిని వేధించే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని డీసీపీ ఉషారాణి స్పష్టం చేశారు. గత నెల రోజులుగా షీ టీమ్స్ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో భాగంగా, మహిళలను వేధిస్తున్న 59 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 49 మంది మేజర్లు, 10 మంది మైనర్లు ఉన్నారు.
ఏప్రిల్ మొదటి పక్షంలో షీ టీమ్స్‌కు మొత్తం 72 ఫిర్యాదులు అందాయని, వాటిలో సోషల్ మీడియా వేధింపులు 23, ఫోన్ కాల్స్ ద్వారా వేధింపులు 19, ప్రత్యక్ష వేధింపులు 30 ఉన్నాయని డీసీపీ వివరించారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా 6 క్రిమినల్ కేసులు, 19 పెట్టీ కేసులు నమోదు చేశారు. 38 మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పరిచయమై యువతిని బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తిని, ఇన్స్టాగ్రామ్ ద్వారా వేధించిన వ్యక్తిని, అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. మెట్రో రైలు మహిళల కోచ్‌లలో అక్రమంగా ప్రయాణిస్తున్న నలుగురు పురుషులకు జరిమానాలు విధించారు.
మహిళా భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ నెలలో 37 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 2,319 మందికి మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. వేధింపులకు గురవుతున్న మహిళలు భయపడకుండా మల్కాజ్గిరి షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 8712662111 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని డీసీపీ కోరారు.










