ఆర్థిక నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు, బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతనంగా ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించింది.
నేరెడ్‌మెట్‌లోని సిపిఓ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్‌ను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బుధవారం అధికారికంగా ప్రారంభించారు. పోలీస్ క్వార్టర్స్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ స్టేషన్ వద్ద, కమిషనర్ స్వయంగా జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీ నమోదు చేసి విధులను ప్రారంభించారు.
ఈ ప్రత్యేక విభాగానికి రోడ్ సేఫ్టీ డీసీపీ కె. మనోహర్ పర్యవేక్షణ వహించనున్నారు. ఆయనకు సహాయకులుగా ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆర్థిక నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఈఓడబ్ల్యూ పరిధిలో భారీ ఆర్థిక మోసాలు, రూ.2 కోట్లకు పైబడిన మోసాలు, నమ్మకద్రోహం, ఫోర్జరీ కేసులు విచారణకు వస్తాయి. తెలంగాణ రాష్ట్ర డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం రూ.1 కోటి దాటిన డిపాజిట్ మోసాలపై కూడా ఈ విభాగం దర్యాప్తు చేపడుతుంది. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇతర కీలక ఆర్థిక నేరాల కేసులను కూడా ఈ స్టేషన్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది.
కార్యాలయ ప్రారంభం అనంతరం కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, సాంకేతికతను సమర్థంగా వినియోగించి ఆర్థిక నేరాల మూలాలను గుర్తించాలని, ప్రజల సొమ్ము రక్షణలో ఎలాంటి రాజీ పడకూడదని సూచించారు. ఈ విభాగం ఏర్పాటుతో జిల్లాలో ఆర్థిక నేరాల దర్యాప్తు వేగవంతం అవుతుందని పోలీస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.











