ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ప్రమాదంలో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రాయవరం క్వారీల వద్ద వేగంగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొన్న ధాటికి టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లోనే మంటలు రెండు వాహనాలకు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
మంటల తీవ్రత కారణంగా బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. కొందరు ప్రయాణికులు కిటికీలు పగులగొట్టుకుని ప్రాణాలతో బయటపడగా, లోపల చిక్కుకుపోయిన 10 మంది అక్కడికక్కడే మరణించారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ ప్రమాదంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.







