నారాయణపేట జిల్లాలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ (MLM) స్కీముల పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో సూచించారు. సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజల సొమ్మును దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ, గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో ప్రజలను మోసం చేసే MLM పథకాలు పెరుగుతున్నాయని, తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపి మోసగిస్తున్నారని తెలిపారు. మీ క్రింద ఎక్కువ మంది ఏజెంట్లను చేర్పించి లాభాలు పొందండి అనే వాగ్దానాలను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఇలాంటి వ్యాపారాల ద్వారా ప్రజల నుంచి డబ్బులు సేకరించి ఆర్థికంగా మోసం చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.
ఎక్కువ మంది ఏజెంట్లను చేర్పిస్తే రివార్డులు, పాయింట్లు లభిస్తాయని కేటుగాళ్లు ఆశ చూపుతారని, ఇలాంటి వారి మాయమాటలు నమ్మి అత్యాశకు పోతే భారీగా ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉందని ఎస్పీ వినీత్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు MLM పై దృష్టి సారించి, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు చేసి అమాయకులను ఆకర్షించి మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
చాలామంది విదేశాల నుంచి MLM లను నడుపుతూ, భారీ లాభాలతో పాటు లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్ల పేరుతో అమాయకులకు వల వేస్తున్నారని, ఎలాంటి మాయమాటలు నమ్మరాదని ఎస్పీ స్పష్టం చేశారు. అతి తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయని ఎవరైనా చెప్తే అది మోసమని గ్రహించాలని, లేదంటే ప్రజలను మాయలోకి దింపి డబ్బులు కొల్లగొడతారని, అత్యాశకు పోతే మోసపోవడం ఖాయమని ఆయన అన్నారు.
గొలుసుకట్టు మార్కెటింగ్‌లో ముందుగా చేరిన వారికి లాభాలు వస్తాయని, ఆ తర్వాత చేరిన వారంతా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. ఇలాంటి నెట్‌వర్క్‌లలో ఎవరు చేరవద్దని, ఆయా సంస్థల నిర్వాహకులు, కంపెనీలు పెట్టే సభలు, సమావేశాలకు హాజరు కావద్దని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింకులు, APK ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దని కోరారు. మోసపూరిత ప్రకటనలపై, ఆర్థిక మోసాలపై వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.











