ప్రేమ వ్యవహారానికి అడ్డువస్తుందన్న కారణంతో కన్నతల్లినే కుమార్తె, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసి, ఇంట్లోనే పాతిపెట్టిన దారుణం జవహర్‌నగర్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మల్కాజిగిరి జోన్ డీసీపీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, కౌకూర్ భరత్‌నగర్‌కు చెందిన అంజు (40) తన చిన్న కుమార్తె (17) ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించింది. బాలిక బీహార్‌కు చెందిన డ్రైవర్ మోంటీ కుమార్ సింగ్‌తో పరిచయం పెంచుకుంది. గతంలో మోంటీపై పోక్సో కేసులు నమోదైనప్పటికీ, వారిద్దరి సంబంధం కొనసాగింది.
తల్లి అడ్డంకులను తొలగించుకోవడానికి కుమార్తె, మోంటీ కలిసి పథకం రచించారు. గత ఏడాది మే 12న ఇంట్లోనే అంజుపై దాడి చేసి, మోంటీ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే గుంత తీసి పూడ్చిపెట్టి, సాక్ష్యాలను మాయం చేశారు.
తల్లి కనిపించకుండా పోయిందని పెద్ద కుమార్తె రోషిణి ఫిర్యాదుతో కేసు నమోదైంది. దర్యాప్తులో మోంటీని విచారించగా హత్య విషయం బయటపడింది. హత్య అనంతరం నిందితులు వివాహం చేసుకుని, ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లిదండ్రులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.
నిందితులను అరెస్ట్ చేసి, తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని డీసీపీ అభినందించారు.











