రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది అభివృద్ధిలో భాగంగా, గండిపేట సమీపంలో రూ.663 కోట్లతో ఓంకారేశ్వర స్వామి ఆలయం, ఇతర నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్ మహానగరానికి పశ్చిమ దిశలో, గండిపేట మండలం మంచిరేవులలో 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ఈ ప్రణాళికలను రూపొందించింది. ఆలయంతో పాటు వంద అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం, తీగల వంతెన, పార్కింగ్ కాంప్లెక్స్, రోడ్లు, ల్యాండ్స్కేపులు వంటి అభివృద్ధి పనులు కూడా ఇందులో భాగం.
శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనల మేరకు ఆలయ నిర్మాణ శైలిని ఖరారు చేశారు. ఓంకారేశ్వర స్వామి ఆలయ గాలి గోపురం 100 అడుగుల ఎత్తు ఉండగా, 207 అడుగుల పొడవైన ప్రధాన మండపం, 64 అడుగుల ఎత్తు గల గర్భాలయ గోపురం నిర్మించనున్నారు. రాష్ట్రంలో యాదగిరిగుట్ట తర్వాత ఇదే అతిపెద్ద గర్భాలయంగా నిలువనుంది. రామప్ప, యాదగిరిగుట్ట ఆలయాల్లో ఉపయోగించిన తరహా రాయిని ఇక్కడ వినియోగిస్తారు.
ఆలయానికి సమీపంలో మూసీ నదిపై చెక్‌డ్యామ్‌ను నిర్మించి, నీటి నిల్వతో పాటు బోటింగ్ వంటి సౌకర్యాలు కల్పించే ప్రణాళికలున్నాయి. ఈ ప్రాంతం చిన్న శ్రీశైలంగా మారే అవకాశాలున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయం 800 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం సమీపంలో కొలువుదీరనుంది. మచిలేశ్వర స్వామి ఆలయంలో చేప ఆకారంలో శివలింగం ఉండటం విశేషం.











