రాష్ట్రంలో సంతానోత్పత్తి పెంపునకు ఆటంకంగా ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా, అన్ని వర్గాల ప్రజల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత నైపుణ్య వికాస ప్రణాళికను రూపొందించింది. జనాభా స్థిరీకరణ లక్ష్యంగా రూపొందించిన నూతన విధానంలో ఈ నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను పొందుపరిచినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
నేటి శతాబ్దపు ఆర్థిక అవసరాలకు అనుగుణంగా అన్ని వయసుల వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి వివరించారు. నూతన జనాభా నిర్వహణ విధానంలో భాగంగా ఆరోగ్యకర సమాజ నిర్మాణంతో పాటు ప్రజల ఆర్థిక సుస్థిరత కోసం అందరికీ నైపుణ్యాభివృద్ధి ఆవశ్యకతను గుర్తించి, ఆ మేరకు కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఆర్థిక, సామాజిక రంగాలకు అవసరమైన సేవల డిమాండ్ గుర్తింపు, లభ్యతల మధ్య వ్యత్యాసాలను గుర్తించి, కొరతను తీర్చే దిశగా శిక్షణా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.
21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థ వికాసంలో అందరూ పాల్గొనే విధంగా దోహదపడేందుకు నూతన జనాభా నిర్వహణ కోసం రూపొందించిన 5 స్తంభాలలో (5 pillars) భాగంగా నైపుణ్యం అంశాన్ని పొందుపరిచినట్లు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వివరించారు. ఈ దిశగా 2035 నాటికి 95 శాతం ప్రజలకు డిజిటల్ అక్షరాస్యతను కల్పించడం, 75 శాతం ప్రజలకు గుర్తించిన మేరకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, శిక్షణ పొందినవారిలో 80 శాతానికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించడం, శిశు సంరక్షణ మరియు వృద్ధులకు అవసరమైన సేవలందించేందుకు లక్ష మందికి సర్టిఫికెట్ కోర్సులను అందించడం, శ్రామిక శక్తి భాగస్వామ్యంలో మహిళల వాటాను 25 శాతం పెంచడం వంటి లక్ష్యాలను నిర్ధారించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నందున పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను చేపడతారు. ఈ దిశగా ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, క్వాంటం కంప్యూటింగ్ కు అవసరమైన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రూ. 13 లక్షల కోట్ల పైగా పెట్టుబడుల కోసం విశాఖపట్నంలో జరిగిన 610 ఎంవోయు(MoUs)లు, ఇతర ఒప్పందాల మేరకు అవసరాలను గుర్తించి కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని తెలిపారు. శిక్షణా కార్యక్రమాల రూపకల్పనలో పారిశ్రామికవేత్తలు, ఇతర పెట్టుబడిదారులకు తగు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు.











