దేశవ్యాప్తంగా వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్ యూజీ-2026) ఆదివారం జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరీక్ష కోసం 73,084 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 199 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుంది. అభ్యర్థులు నిర్ణీత సమయానికి అరగంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నీట్ పరీక్ష పెన్ అండ్ పేపర్ (ఓఎంఆర్ షీట్) పద్ధతిలో జరుగుతుంది. ఈ పరీక్షలో మొత్తం 180 ప్రశ్నలుంటాయి, అన్నింటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సరైన సమాధానానికి నాలుగు మార్కులు, తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. మొత్తం 720 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి 45 ప్రశ్నలు చొప్పున, బయాలజీ (బోటనీ-జువాలజీ) విభాగం నుంచి 90 ప్రశ్నలు వస్తాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్యతో పాటు పరీక్ష కేంద్రాల సంఖ్య కూడా పెరిగింది. గతేడాది 72,507 మంది అభ్యర్థులు 190 కేంద్రాల్లో పరీక్ష రాశారు.
పరీక్షా కేంద్రాలన్నింటినీ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే (మెడికల్ కాలేజీలు మినహా) ఏర్పాటు చేశారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలను నియమించారు. రాష్ట్ర స్థాయిలో వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరేంద్రకుమార్ నోడల్ ఆఫీసర్గా, అదనపు డీజీపీ మహేశ్ భగవత్ పోలీసు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, సీపీ/ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసు అధికారిని నియమించారు. డ్యూయల్ లేయర్ ఫ్రిస్కింగ్, సీసీటీవీ సర్వైలెన్స్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జామర్లను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాల రవాణా, నిల్వ పోలీసు రక్షణలో, సీసీ కెమెరాల నిఘాలో జరుగుతుంది. ఈసారి చిరునామా ఆధారంగా ఇంటికి సమీపంలోనే పరీక్ష కేంద్రాన్ని కేటాయించడం, అమ్మాయిలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం వంటి మార్పులు చేశారు.











