రాత్రి వేళల్లో ఒంటరిగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, మహిళను ఎరగా వేసి డబ్బులు దండుకుంటున్న దంపతులను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత 15 రోజులుగా ఈ జంట నగరంలో హనీట్రాప్ దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీరి వద్ద నుంచి ఒక కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బాధితుల ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి, నిఘా పెట్టి ఈ దంపతుల కదలికలను గమనించారు. చివరికి వారి ప్లాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ దంపతులు తమ పథకంలో భాగంగా, మహిళను రోడ్డుపై ఒంటరిగా నిలబెట్టి, వెళ్లేవారిని ఆపేలా చేసేవారని, మాటల్లో మాయ చేసి దగ్గరకు రప్పించి, బేరసారాలు జరిగిన తర్వాత వారితో కలిసి వెళ్లేదని తెలిసింది.
ఆమె వెళ్లిన కొద్దిసేపటికే ఆమె భర్త అక్కడికి వచ్చి, బాధితుడిని "నా భార్యతో ఎలా వచ్చావ్?" అంటూ ప్రశ్నించి, గొడవకు దిగేవాడని, ఇదే సమయంలో భార్య కూడా "నాపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు" అంటూ అరుపులు మొదలుపెట్టి, పోలీసుల పేరుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
పరువు పోతుందనే భయంతో, కేసుల్లో ఇరుక్కుపోతామనే టెన్షన్‌తో బాధితులు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారని తెలిసింది. ఎవరైనా ఎదురుతిరిగినా, డబ్బు ఇవ్వడానికి నిరాకరించినా బెదిరించేందుకు కత్తిని ఉపయోగించాలని ప్రణాళిక రచించినట్లు విచారణలో బయటపడింది.
డబ్బుల కోసం భార్యనే ఎరగా ఉపయోగించుకున్న ఈ దంపతుల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.











