నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఎరువుల లారీ వరుసగా ఏడు కార్లను ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి.
చంద్రాయన్పల్లి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న వాహనం సాంకేతిక లోపం కారణంగా రోడ్డుపై నిలిచిపోవడంతో, వెనుక వస్తున్న కార్లు వేగాన్ని తగ్గించాయి. ఈ క్రమంలోనే వెనుక నుంచి వచ్చిన ఎరువుల లారీ అదుపుతప్పి కార్లను ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు కార్లు ఒకదానికొకటి ఢీకొంటూ ముందుకు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో పలు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. కార్లలో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులకు గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపారు.












