నిమ్స్ (NIMS) లో ఇటీవల విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ లో కేవలం బిఎస్సీ, ఎంఎల్టి (MLT) అభ్యర్థులకే అవకాశం కల్పించడంపై పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఎంఎల్టి, డిఎల్టి (DMLT) కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు నష్టపోతున్నారని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) డాక్టర్ నాగేందర్ ను కలిసి మెమోరాండం సమర్పించారు.
పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్రంలో వేలాది మంది ఎంఎల్టి, డిఎల్టి చేసినవారు చాలా సంవత్సరాలుగా కాంట్రాక్టు, ఔటసోర్సింగ్ పద్ధతుల్లో సేవలు అందిస్తున్నారని తెలిపారు. నిమ్స్ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ లో కేవలం బిఎస్సీ, ఎంఎల్టి అభ్యర్థులకే ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమని, తమ అర్హతలకు తగిన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విజ్ఞప్తిపై స్పందించిన డిఎంఇ డాక్టర్ నాగేందర్, నిమ్స్ యాజమాన్యంతో చర్చించి, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, అభ్యర్థుల సమస్య పరిష్కారం అయ్యేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య, ప్రధాన కార్యదర్శి అజయ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిన్నెర రవీందర్, రాష్ట్ర కోఆర్డినేటర్ తలారి ప్రవీణ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.











