మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
బాలానగర్ పరిధిలోని ఎన్.ఎస్.కే.కే పాఠశాలలో ఏర్పాటు చేసిన వాల్యుయేషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పరిశీలించారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖాధికారి విజయకుమారి కూడా పాల్గొన్నారు. మూల్యాంకన ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అత్యంత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా దిద్దుబాటు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు.
తీవ్ర ఎండల నేపథ్యంలో, మూల్యాంకన కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తగిన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిరంతర తాగునీటి సరఫరా, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం, గదుల్లో సరైన గాలి, వెలుతురు ఉండేలా చూడటం, అవసరమైతే కూలర్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.
నిర్దేశించిన గడువులోగా మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి, ఫలితాల విడుదలకు సహకరించాలని అధికారులకు స్పష్టం చేశారు. వాల్యుయేషన్ కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేయాలని, అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు, క్యాంప్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్పాట్ క్యాంప్ అధికారులు, విద్యాశాఖ సిబ్బంది, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. మూల్యాంకన ప్రక్రియ సజావుగా, సమర్థవంతంగా జరిగేలా చూడటమే ఈ తనిఖీ ముఖ్య ఉద్దేశ్యం.










