పంట అవశేషాల దహనం వల్ల కలిగే పర్యావరణ, ఆరోగ్య సమస్యలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతి, సన్‌ఫ్లవర్ పంట కొనుగోలు ఏర్పాట్లపై కూడా ఆయన సమీక్షించారు.
పంట అవశేషాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ప్రతి గ్రామంలో టామ్‌టామ్ ద్వారా రాబోయే 15 నుంచి 30 రోజుల పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. అవగాహన కార్యక్రమాల అనంతరం కూడా పంట అవశేషాలను కాల్చేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయాలని సూచించారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యాసంగి-2026 ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని అభినందించారు. ఈ ఏడాది భారీ స్థాయిలో వరి దిగుబడి వచ్చినప్పటికీ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల మంత్రివర్గం సన్‌ఫ్లవర్ పంట కొనుగోలుకు ఆమోదం తెలిపిందని, దీనికి అవసరమైన ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల చివరి నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానికంగా ఉండే హమాలీలు, రవాణా సమస్యల పరిష్కారానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సన్‌ఫ్లవర్ కొనుగోలుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని, చివరి గింజ వరకు పంట కొనుగోలు జరిగేలా చూడాలని, వరి కొయ్యలను కాల్చకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.










