పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్.పి.జి గ్యాస్ సరఫరాలో పెరిగిన ఒత్తిడిని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నియంత్రించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వినియోగదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
శనివారం ఉదయం దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్ సరఫరాపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుండి పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీ.హెచ్.ఎం.సి ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, గృహ వినియోగ వంటగ్యాస్ సరఫరాపై ప్రజల్లో అపోహలు పెరిగి అయోమయం నెలకొందని మంత్రి తెలిపారు. ఈ భయాందోళనల వల్ల తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఏర్పడిందన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఒత్తిడిని నియంత్రించగలిగామని ఆయన చెప్పారు.
ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, డిమాండ్‌కు తగిన రీతిలో సరఫరా కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, పంపిణీదారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్.పి.జి కొరతను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణకు వాణిజ్య అవసరాల కోసం కేటాయింపులను పెంచాలని ఆయన కేంద్ర మంత్రులను కోరారు.
కేంద్రం వాణిజ్య అవసరాలకు గ్యాస్ కోటాను పెంచగలిగితే, సరఫరాకు అవకాశం ఏర్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెంచి, కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో పైపుల ద్వారా వంటగ్యాస్ సరఫరా నెట్వర్క్ విస్తరణలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటామని, హైదరాబాద్‌లో భాగ్యనగర్ గ్యాస్ సంస్థ ద్వారా సీ.ఎన్.జీ సరఫరాను విస్తరిస్తున్నామని, జంట నగరాల్లో ఆటోలు, ట్యాక్సీలతో పాటు ప్రయివేటు వాహనాలకు సీ.ఎన్.జీ సరఫరాకై ఫిల్లింగ్ కేంద్రాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.










