పెద్దకొడప్గల్ మండలంలోని కాటేపల్లి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మైనర్లపై జరిగే నేరాలు, ప్రేమ పేరుతో జరిగే మోసాలు, సైబర్ నేరాలు, వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలపై పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, పెద్దకొడప్గల్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ జి. అరుణ్ కుమార్ పర్యవేక్షణలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. పోలీస్ కళాబృందం సభ్యులు విద్యార్థులకు పలు కీలక అంశాలపై వివరించారు.
మైనర్లపై జరిగే నేరాలు, ప్రేమ పేరుతో మోసగించడం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 'డైల్ 100'కు కాల్ చేయాలని, మహిళలు, బాలికలు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు 'షి టీమ్' నంబర్ 8712686094ను సంప్రదించాలని తెలిపారు. సైబర్ మోసాల నివారణకు టోల్ ఫ్రీ నంబర్ 1930 అందుబాటులో ఉందని వివరించారు.
సామాజిక మాధ్యమాలను (ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్) జాగ్రత్తగా ఉపయోగించాలని, విద్యార్థులు తమ చదువుపై దృష్టి సారించాలని, తల్లిదండ్రుల మాట వినాలని సూచించారు. చిన్న పొరపాట్లు జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఉదాహరణలతో వివరించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషారావు, కానిస్టేబుల్స్ ప్రభాకర్, సాయిలు పాటలు, నాటికల ద్వారా అవగాహన కల్పించారు. బాన్స్వాడ షి టీమ్ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.








