ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి నిజమైన సంపద అని, ప్రతి ఒక్కరూ తీసుకునే ఆహారం ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ విద్యచందన అన్నారు. కొత్తగూడెం డివిజన్లోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో శుక్రవారం జిల్లా స్థాయి పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమాన్ని మహిళాశిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో విద్యనభ్యసించిన పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, గర్భిణీలకు శ్రీమంతాలు వంటి కార్యక్రమాలు జరిగాయి. పోషణ పక్వాడ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా స్థాయి సిడిపివోలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది, అంగన్వాడి టీచర్లకు ప్రశంసా పత్రాలు, మెమంటోలు అందజేశారు.
జిల్లా అదనపు కలెక్టర్ విద్యచందన మాట్లాడుతూ, పోషణ పక్వాడ స్ఫూర్తిని ఏడాది పొడవునా కొనసాగించాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. 2026 నాటికి జిల్లాను పోషకాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది పనిచేయాలని కోరారు.
కేవలం ఆహారం తీసుకోవడమే కాకుండా, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందేలా పోషక విలువలున్న ఆహారాన్ని ఎంచుకోవాలని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారిణి జె.స్వర్ణలత మాట్లాడుతూ, పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 2061 అంగన్వాడి కేంద్రాలలో లబ్ధిదారులతో పాటు ప్రజలలో కూడా పౌష్టికాహార విలువలపై అవగాహన కల్పించామని తెలిపారు. గర్భిణీ స్త్రీలు ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లతో పాటు ఆకుకూరలు, పాలు, గుడ్లు వంటి బలమైన ఆహారం తీసుకోవాలని, పుట్టిన బిడ్డకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వడం వల్ల జీవితాంతం అవసరమైన రోగనిరోధక శక్తి లభిస్తుందని వివరించారు. అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించే సామూహిక వేడుకల ద్వారా పిల్లల ఎదుగుదలపై అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి దోహదపడతారని తెలిపారు.











