ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. గురువారం ఆయన కూకట్‌పల్లిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైద్యులు అంకితభావంతో పనిచేయాలని, 24 గంటల పాటు రోగులకు సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య, వారి వివరాలను రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అని ఆయన స్వయంగా పరిశీలించారు.
ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కొరత, మరమ్మత్తులు, డెలివరీ టీమ్స్ అవసరాలపై మెడికల్ ఆఫీసర్‌ను అడిగి తెలుసుకున్నారు. వీటి పరిష్కారానికి తక్షణమే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచేందుకు శానిటేషన్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మందుల నిల్వలను పరిశీలించి, ఎక్స్పైరీ డేట్ ముగిసిన మందులు పంపిణీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫార్మసీ సిబ్బందిని హెచ్చరించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.











