సంగారెడ్డి జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (DCC), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (DLRC) సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన అదనపు కలెక్టర్ పాండు, అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించడం ద్వారా ప్రాధాన్యతా రంగాల అభివృద్ధికి బ్యాంకులు మరింత చురుకుగా వ్యవహరించాలని కోరారు. జిల్లా బ్యాంకింగ్ కార్యకలాపాలపై లీడ్ బ్యాంక్ మేనేజర్ టి. సుధీర్ కుమార్ సమగ్ర నివేదికను సమర్పించారు.
జిల్లాలో పంట రుణాల లక్ష్యం రూ.3,499.21 కోట్లకు గాను 90.66 శాతం, మొత్తం వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.6,816.57 కోట్లకు గాను 87.16 శాతం, మొత్తం అడ్వాన్సుల లక్ష్యం రూ.23,438.93 కోట్లకు గాను 92.81 శాతం సాధించినట్లు నివేదికలో వెల్లడైంది. విద్యా, గృహ, MSME, స్వయం సహాయక సంఘాల రుణాల పురోగతిని కూడా సమీక్షించారు.
ఆర్బీఐ ఏజీఎం శ్రీనివాస్ వెన్న, ప్రధానమంత్రి జనసురక్ష పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, లబ్ధిదారులను పెంచాలని సూచించారు. రీ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం, ఖాతాలను సక్రియంగా నిర్వహించడంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నాబార్డ్ ఏజీఎం కృష్ణతేజ, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, కిసాన్ క్రెడిట్ కార్డు, పశుసంవర్ధక, మత్స్యరంగ రుణాల కింద అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఈ సమావేశానికి వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరయ్యారు.











