రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద కామారెడ్డి జిల్లాలో ఆర్థిక సాయం పంపిణీని మంగళవారం ప్రారంభించారు. అర్హులైన రైతులకు నేరుగా వారి ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
రామారెడ్డి మండలంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని అధికారికంగా ప్రారంభించిన అనంతరం, ఆయన ప్రసంగాన్ని రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి వీక్షించారు.
రైతులకు పెట్టుబడి వ్యయభారం తగ్గించి, సాగుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ వివరించారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని, పెట్టుబడి సకాలంలో అందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2025-26 వానాకాలం సీజన్లో జిల్లాలో 10,851 మంది రైతులకు రూ.9.35 కోట్లకు పైగా, యాసంగి సీజన్లో 10,950 మంది రైతులకు రూ.7.34 కోట్లకు పైగా రైతు భరోసా నిధులు జమ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు వెంటనే నిధులు జమ అవుతాయని, మిగిలిన వారికి తొమ్మిది రోజుల్లో దశలవారీగా అందజేస్తామని తెలిపారు.
అర్హులైన ప్రతి రైతుకు పథకం సాయం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, నిధుల జమ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆధునిక సాగు విధానాలను అవలంబించి, అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.











