వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటలో భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే, భర్త వీడియో తీసిన దారుణం వెలుగులోకి వచ్చింది. లోకో పైలట్‌గా పనిచేస్తున్న భర్త, భార్యను వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో వీడియో తీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాజంపేటలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఒంగోలుకు చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ రైల్వే శాఖలో లోకో పైలట్‌గా పనిచేస్తూ, రాజంపేటలో రైల్వే కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. 2016లో మొదటి భార్య చనిపోయిన విషయాన్ని దాచి, నందలూరుకు చెందిన కృష్ణవేణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సమాచారం ప్రకారం, శ్రీనివాస్ తరచూ మద్యం సేవించి భార్య కృష్ణవేణిని వేధించేవాడు. బెల్టుతో కొట్టడం, ఆమెను ఇంట్లో బంధించడం వంటి చర్యలకు పాల్పడేవాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వేధింపులు భరించలేక కృష్ణవేణి బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆమె ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో, శ్రీనివాస్ ఆమెను కాపాడకుండా, ఎలా ఆత్మహత్య చేసుకోవాలో సూచనలు ఇస్తూ, నవ్వుతూ సెల్ ఫోన్లో వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఆమె ప్రాణాలు విడుస్తున్నా ఏమాత్రం చలించకుండా ఈ దృశ్యాలను చిత్రీకరించడం విస్మయం కలిగిస్తోంది.
భార్య మరణించిన తర్వాత, శ్రీనివాస్ మద్యం సేవించి తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అనంతరం రాజంపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

