కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ బండలో కమ్యూనిటీ హాల్ దుర్వినియోగం, యూపీహెచ్సీ సెంటర్ వద్ద మట్టి పేరుకుపోవడం వంటి సమస్యలపై రాజన్న టీమ్ చేసిన ఫిర్యాదుతో అధికారులు వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టారు.
ఎల్లమ్మ బండలో ఉన్న కమ్యూనిటీ హాల్‌ను కొందరు వ్యక్తులు తమ రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, అలాగే యూపీహెచ్సీ సెంటర్ వద్ద పేరుకుపోయిన మట్టి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాజన్న టీమ్ సభ్యుడు బుల్లెట్ రవి, ఆల్విన్ కాలనీ సర్కిల్ డిసి ఛాముండేశ్వరి దృష్టికి తీసుకెళ్లారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే డిసి ఛాముండేశ్వరి స్పందించి, అధికారులను ఆదేశించారు. కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న రాజకీయ పార్టీ ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
అదేవిధంగా, యూపీహెచ్సీ సెంటర్ వద్ద పేరుకుపోయిన మట్టిని కూడా తొలగించేలా చర్యలు చేపట్టారు. ప్రజావాణిలో ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు స్పందించి, కమ్యూనిటీ హాల్ మరియు యూపీహెచ్సీ వద్ద ఉన్న సమస్యలను పరిష్కరించడం పట్ల స్థానికులు డిసి ఛాముండేశ్వరి పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.
కమ్యూనిటీ హాల్‌ను ఎల్లమ్మ బండలోని అన్ని కాలనీలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో, అన్ని కాలనీల సభ్యులు డిసి ఛాముండేశ్వరి మరియు రాజన్న టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ చర్యలు స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగించాయి.











