మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసుల పేరుతో రిటైర్డ్ న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు, రూ. 1.66 కోట్లను కాజేశారు. సీబీఐ అధికారులమని నమ్మించి, డిజిటల్ అరెస్ట్ చేసి, భయపెట్టి డబ్బును లాగేసుకున్నారు.
సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ ద్వారా సీబీఐ అధికారులమని చెప్పుకుని, రిటైర్డ్ జడ్జిని భయపెట్టారు. ఆయనపై మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని, సుప్రీంకోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని బెదిరించారు. ఈ విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దని ఆదేశించారు.
ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ల ద్వారా మహిళలకు అభ్యంతరకరమైన కాల్స్ వెళ్తున్నాయని, బెంగళూరులో కేసు నమోదైందని కూడా నమ్మించారు. అరెస్టు చేస్తే ప్రతిష్టకు భంగం కలుగుతుందనే భయంతో, బాధితుడు రూ. 1.66 కోట్లను సైబర్ నేరగాళ్లకు బదిలీ చేశారు. విచారణ తర్వాత డబ్బు తిరిగి వస్తుందని మోసగాళ్లు చెప్పినట్లు సమాచారం.
అయితే, డబ్బు తిరిగి రాకపోవడంతో, రిటైర్డ్ జడ్జి పోలీసులను ఆశ్రయించారు. నేరెడ్మెట్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలపై లోతుగా విచారణ జరుగుతోంది.

