సంగారెడ్డి, జూలై 5
విశ్రాంత మండల విద్యాధికారి సేవా కార్యక్రమాల్లో విశేష కృషికి గుర్తింపుగా రోటరీ ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. సంగారెడ్డికి చెందిన డి.అంజయ్య, రోటరీ క్లబ్ సభ్యుడిగా చేరిన తర్వాత స్వచ్ఛంద రక్తదానం, బాల కార్మికుల పునరావాసం వంటి అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
విశ్రాంత మండల విద్యాధికారి డి.అంజయ్యకు సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష కృషికి గుర్తింపుగా రోటరీ ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. మండల విద్యాధికారిగా పదవీ విరమణ అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ మంజీర, సంగారెడ్డి సభ్యుడిగా చేరిన డి.అంజయ్య వివిధ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
ముఖ్యంగా స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం, రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, బాల కార్మికులను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించడం, బడి బయట ఉన్న పిల్లలను తిరిగి విద్యాబాట పట్టించడం వంటి సేవలను ఆయన అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన రోటరీ ఇంటర్నేషనల్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రకటించింది.
ఈ సందర్భంగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రాంప్రసాద్ డి. అంజయ్యను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. అవార్డు లభించిన సందర్భంగా డి.అంజయ్య మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించిన రోటరీ ఇంటర్నేషనల్‌తో పాటు తనను ప్రోత్సహించిన రోటరీ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంజీర, సంగారెడ్డి అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి కమలాకర్ రాజు, రోటరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.











