ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీకి మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నాయి. మంత్రుల బృందం అన్ని సంఘాల అభిప్రాయాలను సవివరంగా నమోదు చేసుకుంటోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.
ఆర్టీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తమ దశాబ్దాల నాటి పెండింగ్ సమస్యలు పరిష్కరించబడ్డాయని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 55 రోజుల పాటు సమ్మె చేసినప్పటికీ, ఎలాంటి హామీ నెరవేర్చలేదని వారు తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలోనే 2013 బాండ్స్ కింద 280 కోట్ల రూపాయలను క్లియర్ చేసిందని, 2017కి సంబంధించిన పీఆర్సీని మంజూరు చేసిందని, పెండింగ్ డీఏలను లేకుండా చేసిందని సంఘాల నాయకులు వివరించారు. సర్వీసు నుండి శాశ్వతంగా తొలగించబడిన 270 మందికి త్రిసభ్య కమిటీ ద్వారా ఉద్యోగాలు కల్పించారని, సీసీఎస్, పీఎఫ్ బకాయిలను కూడా తీర్చారని తెలిపారు.
యూనియన్లు లేకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు తగిన ప్రచారం జరగలేదని ఆర్టీసీ జేఏసీ మంత్రులకు వివరించింది. మంత్రుల బృందం అన్ని సంఘాల ప్రతిపాదనలను, సమస్యలను ఓపికగా ఆలకించి, తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.









