సంగారెడ్డి జిల్లాను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు పైలట్ జిల్లాగా ఎంపిక చేయడంతో ఆరోగ్య రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులలో రోగుల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియ ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది.
సంగారెడ్డి డివిజన్ పరిధిలోని 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), రెండు ఏరియా ఆసుపత్రులు, మూడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHCs), ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH), ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సోమవారం నుంచి రోగుల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయడం ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇందిరానగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియ, డేటా ఎంట్రీ, రోగుల వివరాల సేకరణ విధానాన్ని పరిశీలించారు. రోగుల ఆరోగ్య చరిత్రను డిజిటల్ రూపంలో భద్రపరచడం ద్వారా వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించవచ్చని ఆమె తెలిపారు.
నెట్వర్క్, టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు ప్రగతిని సమీక్షిస్తూ సమర్థవంతంగా అమలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుతో రోగుల ఆరోగ్య చరిత్ర, పరీక్షల వివరాలు, చికిత్స సమాచారం అన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయని, ఇది అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన వైద్య సేవలు అందించడానికి ఎంతో దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వసంత్ రావు, డాక్టర్ శశాంక్, మెడికల్ ఆఫీసర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.











